Chandrababu: భూమి కబ్జా చేయాలనుకుంటే..జైలు గుర్తుకురావాలి సీఎం..! 2 d ago
సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తానని, జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం మాట్లాడారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామని, భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. మీ తాత, తండ్రుల కష్టార్జితం మీకే దక్కాలని అన్నారు. కబ్జా చేయాలనుకున్న భూమి కనిపిస్తే చాలు..జైలు గుర్తుకు రావాలని సీఎం చెప్పారు. తప్పుడు సర్వేలు జరిగాయని లక్షల మంది ఫిర్యాదు చేసారని చెప్పారు. సర్వే వల్ల సెంటు, రెండు సెంట్ల భూమి పోయిందని ఫిర్యాదులు వస్తున్నాయి. భూమి గురించి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూమి కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో తేడాలు పరిష్కరిస్తామని, వారసుల పేర్లు సరిగా ఉండేలా చూస్తామని స్పష్టం చేసారు. అన్నీ సరిచేసి మీకు పట్టాదారు పాస్‌బుక్ ఇస్తామన్నారు. పట్టాదారు పాస్‌బుక్‌లో క్యూఆర్ కోడ్ ఇస్తాం. అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని అన్నారు. సదస్సుల్లో ఇప్పటి వరకు 3లక్షల మంది పాల్గొన్నారని సీఎం పేర్కొన్నారు.